చేపల వేట సరదా.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి
బావిలో పడి ఇద్దరు బాలురు మృతి..
ఖాజీరామారం గ్రామంలో విషాదం
నల్లగొండ రూరల్, (ఆంధ్రప్రభ): నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బొంగరాల మణిదీప్ (13), బొల్గూరి వినయ్ (11) శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని గచ్చుబావి వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించడంతో పాటు స్థానికులను విచారించిన పోలీసులు బావి వద్ద చిన్నారుల చెప్పులు గుర్తించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఇద్దరి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు.
మృతుడు మణిదీప్ బొంగరాల శంకర్ కుమారుడు కాగా, నల్లగొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వినయ్ బొల్గూరి నరేష్ కుమారుడు కాగా, స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం శాలిగౌరారం సీఐ, ఎస్ఐ శంకర్ గ్రామ పెద్దలతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు సరదాగా చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఖాజీరామారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
