భక్తి ప్రేమతో అమ్మకు సారే..

  • ఆషాఢ సారెకు పోటెత్తిన భక్తజనం
  • నాలుగో రోజు ఇంద్రకీలాద్రిపై మహిళా భక్తుల సందడి
  • 21 సారె బృందాల్లో 11,613 మంది భక్తుల రాక
  • సారె భక్తులందరికీ రూ.100 దర్శనం క్యూ లైన్‌ కేటాయింపు
  • భక్తులతో మాట్లాడిన ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ
  • అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సమర్పణ

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సమర్పిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

శనివారం మొత్తం 21 సారె బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకోగా.. ఆయా బృందాల్లో 11,613 మంది భక్తులు సారె సమర్పణకు హాజరైనట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సారె భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భవానీ అనుగ్రహ దర్శన్‌ (రూ.100 దర్శనం) క్యూ లైన్‌ను సారె భక్తులందరికీ కేటాయించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో వీకే శీనానాయక్‌, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు సారె బృందాలతో మాట్లాడి ఏర్పాట్లను, భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.