అటవీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఇతర వినియోగాలకు మార్చొద్దు

అటవీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఇతర వినియోగాలకు మార్చొద్దు
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:
అటవీ భూములు , రెవెన్యూ భూములకు సంబంధించి రికార్డుల నవీకరణ, రీ-సర్వే ప్రక్రియలను పూర్తి స్పష్టతతో నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అటవీ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అటవీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులతో ఆమె ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ భూముల వివరాల సేకరణకు ప్రత్యేక ప్రొఫార్మాలు రూపొందించినట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించిన అన్ని వివరాలను సూచించిన ప్రోఫార్మా-1 ప్రకారం, ఫారెస్ట్ తరహా భూములకు సంబంధించి రెండు వేర్వేరు ప్రోఫార్మాల్లో, అలాగే సి.ఏ. ల్యాండ్స్‌కు (CA Lands) సంబంధించిన వివరాలను మూడో ప్రోఫార్మాలో పొందుపరిచి సమగ్ర నివేదికలు అందించాలని ఆదేశించారు. ఏ భూమి అటవీ ప్రాంతం, ఏది రెవెన్యూ భూమి అనే అంశాన్ని రికార్డుల ఆధారంగా ఖచ్చితంగా నిర్ధారించాలని సూచించారు. ఫారెస్ట్ శాఖ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయబడిన భూములు లేదా ఆర్.ఎస్.ఆర్ (RSR) రికార్డుల్లో ఫారెస్ట్‌గా నమోదైన ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వినియోగాలకు మార్చరాదని స్పష్టం చేశారు. అటవీ భూములను అటవీ ప్రాంతాలుగానే పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
భూములపై వ్యక్తులకు పట్టాలు ఉన్నప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లో ముందుగా సంబంధిత భూములను “ఫారెస్ట్”గా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం చట్టపరమైన, పరిపాలనా పరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. జిల్లాలో 200కుపైగా గ్రామాల్లో రీ-సర్వే వేగంగా కొనసాగుతోందని, ఫారెస్ట్ బౌండరీల నిర్ణయంలో వివాదాలు తలెత్తకుండా ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేయర్లతో పాటు అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బౌండరీ ఫిక్సేషన్ సమయంలో ఫారెస్ట్ శాఖకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం ఇవ్వాలని, సంబంధిత సర్వేయర్లు, అధికారులకు లిఖితపూర్వక కమ్యూనికేషన్ పంపాలని ఆదేశించారు. రీ-సర్వే షెడ్యూల్‌ను ఫేజ్‌వైజ్‌గా డీఎఫ్‌ఓలకు వెంటనే పంపించాలని, గ్రామ సభలు లేదా ఫీల్డ్ సందర్శనలకు కనీసం వారం ముందు అటవీ శాఖకు సమాచారం అందేలా చూడాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వెబ్‌ల్యాండ్‌లో అటవీ భూములుగా నమోదైన సర్వే నంబర్లు, ఫారెస్ట్ లైక్ ఏరియాస్, సి.ఏ ల్యాండ్స్‌కు సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పొరపాటున రెవెన్యూ భూములుగా భావించి పట్టాలు జారీ చేసిన ప్రాంతాలు, సాగులో ఉన్న అటవీ భూములను గుర్తించి తిరిగి ఫారెస్ట్ శాఖకు అప్పగించే అంశంపై కూడా పరిశీలించాలన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు, రెవెన్యూ రికార్డుల్లో అడవిగా నమోదైన భూములు, బయోడైవర్సిటీ కలిగిన ఫారెస్ట్ లైక్ ఏరియాస్‌ను మూడు కేటగిరీలుగా విభజించి నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మండలాల వారీగా ఉన్న భూ సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డోన్ మండలంలో “అడవి పొరంబోకు” నామకరణంతో ఏర్పడిన సమస్యపై సమగ్ర పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. కొత్తకోట గ్రామంలో రెవెన్యూ రికార్డుల్లో ఇంకా అటవీ భూమిగా నమోదై ఉన్న 110 ఎకరాల భూమిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బనగానపల్లి పరిధిలో ప్రైవేట్ ఆధీనంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములపై రీ-చెక్ చేయాలని సూచించారు. పాములపాడు మండలంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ (ROFR) నోటిఫికేషన్ మరియు మ్యాపింగ్ మధ్య ఉన్న వ్యت్యాసాలపై సమగ్ర సర్వే నిర్వహించి మే 26లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే అజెండా-1, అజెండా-2లకు సంబంధించిన అన్ని వివరాలను మే 25లోగా కలెక్టరేట్‌కు పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
