రూ.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

రూ.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

రెండేళ్లలో పెనమలూరులో రూ.18.75 కోట్ల సహాయం..

ఆరోగ్య భద్రతపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కీలక సూచనలు

పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గంలో సుమారు రూ.25 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గత రెండేళ్లలో పెనమలూరు నియోజకవర్గంలోనే రూ.18.75 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ, ఎల్‌ఓసీలు, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాల ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేదా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అవసరమైన వైద్య సహాయం వేగంగా అందుతోందని పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఆర్థికంగా కొంత స్థిరంగా ఉన్న కుటుంబాలు తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించడం ద్వారా అవసరమైన సమయంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో, నిపుణులైన వైద్యుల వద్ద మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబం ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.