యోగాతో ఆరోగ్యానికి భరోసా..
యోగాతో ఆరోగ్యానికి భరోసా..
ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలి
మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగా ఉత్తమ మార్గం : గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నాదొరై
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నాదొరై పిలుపునిచ్చారు.
శనివారం కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో, ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగాసనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. యోగా శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే జీవన విధానమని పేర్కొన్నారు.
ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చన్నారు. శరీరానికి, మనస్సుకు మధ్య సమతుల్యతను సాధించేందుకు, ఒత్తిడితో కూడిన జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా అద్భుతమైన సాధనమని చెప్పారు. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగై ఆరోగ్యం మరింత బలపడుతుందని వివరించారు.
జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్, ఆయుష్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
