డెయిరీ సహకార రంగానికి కొత్త నిర్వచనం..

భోపాల్‌లో జాతీయ స్థాయి నేషనల్ డెయిరీ సెల్
సహకార భారతి సమావేశం
దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల ఆదాయ వృద్ధి,
సహకార సంఘాల బలోపేతంపై మేధోమథనం
సమావేశంలో పాల్గన్న కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు

విజయవాడ, ఆంధ్రప్రభ : దేశంలోని డెయిరీ సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడం, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ పాల ఉత్పత్తి వ్యవస్థలకు అనుసంధానం చేయడం లక్ష్యంగా నేషనల్ డెయిరీ సెల్–సహకార భారతి జాతీయ స్థాయి సమావేశం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన డెయిరీ సహకార సంస్థల ప్రతినిధులు, రంగ నిపుణులు, పాల ఉత్పత్తిదారుల సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సమావేశానికి సహకార భారతి అఖిల భారత ప్రధాన కార్యదర్శి దీపక్ చౌరాసియా, అఖిల భారత సంఘటన్ మంత్రి సంజయ్ పచపోర్ హాజరై డెయిరీ సహకార రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు కూడా సమావేశంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో డెయిరీ సహకార రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా పాల ఉత్పత్తి రంగం లక్షలాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

సహకార విధానం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం, నాణ్యమైన పాల ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం ద్వారా డెయిరీ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు సహకారంతో డిజిటలైజేషన్, పాల సేకరణ వ్యవస్థల ఆధునీకరణ, నాణ్యత ప్రమాణాల పెంపు, పాల ఉత్పత్తి సామర్థ్య వృద్ధి వంటి అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని సమావేశంలో చర్చించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు, పారదర్శక వ్యవస్థలు, ఆధునిక పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలు డెయిరీ రంగ అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు.

సహకార భారతి నాయకులు మాట్లాడుతూ సహకార్ సే సమృద్ధి లక్ష్యంతో దేశవ్యాప్తంగా డెయిరీ సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడానికి కృషి జరుగుతోందన్నారు. గ్రామీణ యువత, మహిళలను డెయిరీ రంగంలో భాగస్వాములను చేయడం, విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, చిన్న పాల ఉత్పత్తిదారులను సహకార వ్యవస్థతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.దేశంలో శ్వేత విప్లవానికి పునాదిగా నిలిచిన సహకార డెయిరీ ఉద్యమాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు సాంకేతికత, పారదర్శకత, మార్కెట్ విస్తరణ, రైతు సంక్షేమం అనే నాలుగు ప్రధాన అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. డెయిరీ సహకార సంస్థల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి, విజయవంతమైన నమూనాల అమలు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు.