HYD | సీఎం రేవంత్ పోరాట పటిమ అన్ని వర్గాలకు ఆదర్శం : డాక్టర్ కోట నీలిమ

సనత్ నగర్ : బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆకాంక్షించారు. తాజాగా బ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లు ఆదివారం బ్రాహ్మణ శ్రీ వైష్ణవ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట నీలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే బ్రాహ్మణులకు సమాజంలో సమప్రాధాన్యం లభిస్తోందన్నారు. గతంలో వైస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ దేవాలయాల్లో ధూప-దీప నైవేద్యం కోసం అర్చకులకు రూ.2,500 గౌరవ వేతనం చెల్లించారన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బ్రాహ్మణులు కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిన మాట వాస్తవమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సముచిత స్థానంతో పాటు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందన్నారు.

విదేశాలకు వెళ్లే బ్రాహ్మణ విద్యార్థులకు రూ.20 లక్షల సహాయం అందజేస్తోందని చెప్పారు. ఇలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి చర్యలు చేపడుతోందన్నారు. బ్రాహ్మణులు సమాజహితం కోసం వేదం చదవాలని, అవసరమైనప్పుడు గాండీవం ఎత్తాలన్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే వివిధ పథకాల అమలుతో అసలైన మహిళా సాధికారత చూస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, అన్ని కులాలు, మతాలు సంతోషంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి పోరాట పటిమ అన్ని వర్గాలకు ఆదర్శణీయం అన్నారు.