Hair Fall Problems | హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లకు పెరుగుతున్న డిమాండ్

Hair Fall Problems | హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లకు పెరుగుతున్న డిమాండ్

Hair Fall Problems | పెళ్లి సంబంధాల్లో లుక్స్‌కు పెరిగిన ప్రాధాన్యం
యువకుల్లో పెరుగుతున్న బట్టతల సమస్య
ఐటీ ఉద్యోగుల్లో హెయిర్ ఫాల్‌కు ప్రధాన కారణాలు
సోషల్ మీడియా ప్రభావం మరియు అందాల ప్రమాణాలు
బట్టతలతో యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి

Hair Fall Problems | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఒకప్పుడు పెళ్లిళ్ల సంబంధాల్లో కుటుంబ నేపథ్యం, విద్య, ఉద్యోగం, ఆస్తి ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది. ఆధునిక జీవనశైలి, సామాజిక మాధ్యమాల ప్రభావం, అందంపై పెరిగిన ఆకర్షణ కారణంగా పెళ్లి సంబంధాల్లో లుక్స్ కీలక అంశంగా మారాయి. ముఖ్యంగా యువకుల్లో పెరుగుతున్న బట్టతల సమస్య ఇప్పుడు పెళ్లిళ్లకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. మంచి జీతం, విదేశీ ఉద్యోగం, ఉన్నత విద్య ఉన్నా జుట్టు రాలిపోవడం వల్ల అనేక సంబంధాలు చివరి దశలో విఫలమవుతున్నాయని పెళ్లిళ్ల పేరయ్యలు చెబుతున్నారు.

బట్టతలా… అయితే నో!

పెళ్లి రంగంలో యువతలో 25 నుంచి 35 ఏళ్ల యుక్త వయసులోనే బట్టతల సమస్య కనిపిస్తోంది. నెలకు లక్షల్లో జీతం పొందుతున్నా హెయిర్ ఫాల్, ఫ్రంట్ బాల్డ్ వంటి కారణాలతో పెళ్లికి తిరస్కరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని మ్యాట్రిమోని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లి కుదిరే దశ వరకు వెళ్లి, ఫోటోలు లేదా ప్రత్యక్షంగా చూసిన తర్వాత సంబంధాలు రద్దవుతున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా వధువు కుటుంబాలు చిన్న వయసులోనే బట్టతల ఉంటే తర్వాత ఎలా కనిపిస్తాడు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని పేరయ్యలు చెబుతున్నారు. జలాలు, పరిసరాల కాలుష్యం కూడా ఒక విధంగా జుట్టు రాలడానికి మరో కారణంగా చెబుతున్నారు.

ఐటీ ఉద్యోగుల్లో అధిక సమస్య

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు యువతలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రోజుకు 10 నుంచి 12 గంటలు కంప్యూటర్ల ముందు పనిచేసే ఉద్యోగుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అదనంగా జిమ్ సప్లిమెంట్లు, అనియంత్రిత డైటింగ్, మానసిక ఒత్తిడి కూడా హెయిర్ లాస్‌ను వేగవంతం చేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

ప్యాకేజ్ కంటే జుట్టుకే ప్రాధాన్యం

ఇన్‌స్టాగ్రామ్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు యువతలో పర్ఫెక్ట్ లుక్ అనే భావనను బలంగా నాటుతున్నాయి. ఫోటో ఫిల్టర్లు, స్టైలిష్ హెయిర్ స్టైల్స్, గ్లామర్ జీవనశైలి కారణంగా పెళ్లి ఎంపికల్లో కూడా రూపానికి ఎక్కువ ప్రాధాన్యం పెరిగిందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. “ఉద్యోగం బాగుంది… కానీ జుట్టు లేదు” అనే మాట ఇప్పుడు సంబంధాల వద్ద సాధారణంగా వినిపిస్తోందని పెళ్లిళ్ల మధ్యవర్తులు చెబుతున్నారు. కొందరు యువకులు ఈ కారణంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లకు పెరిగిన డిమాండ్

పెళ్లి ముందు యువకులు హెయిర్ ట్రీట్‌మెంట్లు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయించుకోవడం పెరిగింది. ముఖ్యంగా పెళ్లి చూపుల ముందు లుక్ మార్చుకోవాలి అనే ఆలోచనతో వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నగరాల్లో హెయిర్ క్లినిక్‌ల వ్యాపారం కూడా భారీగా సాగుతోంది. అయితే వైద్యులు మాత్రం తక్షణ ఫలితాల కోసం నకిలీ చికిత్సలపై ఆధారపడొద్దని హెచ్చరిస్తున్నారు. సరైన వైద్యుల సలహాతోనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

యువతలో మానసిక ఒత్తిడి

బట్టతల కారణంగా తిరస్కరణలు ఎదురవుతుండటంతో కొందరు యువకులు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజపు వ్యాఖ్యలు, పెళ్లి ఆలస్యం కారణంగా మానసికంగా కుంగిపోతున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తిత్వం, బాధ్యత, విలువలు, పరస్పర అవగాహన వంటి అంశాల కంటే రూపానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళనకర పరిణామం అని అంటున్నారు.

ఒకప్పుడు ఉద్యోగం ఉంటే చాలు అనుకునే కుటుంబాలు ఇప్పుడు “లుక్ ఎలా ఉంది?” అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఇది పట్టణ జీవనశైలి ప్రభావమా, సోషల్ మీడియా సృష్టించిన అందాల ప్రమాణాలా అనే చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు కొందరు యువతులు మాత్రం వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, కుటుంబ విలువలకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు. రూపం తాత్కాలికం అని, జీవితం నడిపేది పరస్పర గౌరవం అని అభిప్రాయపడుతున్నారు.

పెళ్లి సంబంధాల్లో ఇప్పుడు విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వంతో పాటు రూపానికి కూడా భారీ ప్రాధాన్యం పెరిగింది. బట్టతల వంటి సహజ శారీరక మార్పులు కూడా యువకుల వివాహ అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది కేవలం అందం సమస్య మాత్రమే కాదు… ఆధునిక సమాజం మనుషులను ఎలా అంచనా వేస్తోందనే పెద్ద సామాజిక చర్చకు దారి తీస్తోంది.

Leave a Reply