ఈనెల 4, 5 తేదీలలో ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పరిశీలన

ఈనెల 4, 5 తేదీలలో ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పరిశీలన
- ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు.
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సోమశిల, నార్లాపూర్ ప్రాంతాలతో పాటు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఉయాలవాడ ప్రాంతాలను సందర్శించిన అధికారులు, ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమీక్షించారు.

మొదట సోమశిలలోని హరిత గెస్ట్ హౌస్‌ను పరిశీలించిన అధికారులు, ముఖ్యమంత్రి బస చేయనున్న గదులు, సమావేశ మందిరాలు, విశ్రాంతి సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పర్యటనకు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. హరిత గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలు, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, సమావేశ ప్రాంగణంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి హెలికాప్టర్ రాకపోకల కోసం ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి పర్యటన ప్రాంతాలకు వెళ్లే రహదారుల మరమ్మతులు, శుభ్రత పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం నార్లాపూర్‌లోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి నార్లాపూర్ రిజర్వాయర్ స్టేజ్–3 పనులను సందర్శించనున్న నేపథ్యంలో పనుల పురోగతి, సందర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్నందున, ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఉయాలవాడలో నూతనంగా నిర్మించిన నీటిపారుదల శాఖ కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం కుమ్మెర ప్రాంతంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌సీ పార్థసారథి, ఆర్డీఓ బన్సీలాల్, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ సురేష్‌బాబు, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ మాధవి, నాగర్‌కర్నూల్ తహసీల్దార్ తబితా రాణి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
