బల్మూర్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 14వ తేదీ రాత్రి పొలిసెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆకారపు పరమేష్ బల్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులోని జీఎస్‌ఎన్ కాలేజీ సమీపంలో సుమారు 70 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించినట్లు తెలిపారు.

మృతుడు తెలుపు రంగు బనియన్, నీలం రంగు షార్ట్ ధరించి ఉండగా, చామనచాయ వర్ణం, తెల్లటి గడ్డం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం, మృతుడు భిక్షాటన ద్వారా జీవనం సాగించే వ్యక్తి కావచ్చని భావిస్తున్నారు.

ఇటీవల నమోదవుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply