4న మక్తల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

4న మక్తల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
మక్తల్, ఆంధ్రప్రభ:
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలో కృష్ణా, భీమా నదులపై రెండు బ్యారేజీల నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. మక్తల్ గురుకుల పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 3న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మరుసటి రోజు, ఈ నెల 4న కర్ణాటక నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మక్తల్‌కు చేరుకుంటారని చెప్పారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా, భీమా నదులపై నిర్మించనున్న రెండు బ్యారేజీల కోసం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం సీఎం మళ్లీ మక్తల్‌కు చేరుకుని, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారని మంత్రి వివరించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై కూడా ఏరియల్ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.
కృష్ణా, భీమా నదులపై తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న ప్రాజెక్టుల ద్వారా అదనంగా ఎనిమిది టీఎంసీల జలాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గోనెల బాలకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్, వాకిటి హన్మంతు, బోయ రవికుమార్, చెన్నయ్య గౌడ్, నీలా గౌడ్, కావలి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
