‘ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది’
- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
- పెన్షన్ రూ.4 వేలకు పెంపు..
- ‘తల్లికి వందనం’, ఉచిత బస్సు, గ్యాస్ పథకాలు అమలు
- డీఎస్సీపై జగన్ ఆరోపణలు నిరూపించాలి
- చర్చకు రావాలని సవాల్
భవానీపురం, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ రూ.3 వేలకు చేరడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచిందని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికే సాయం అందించిందని, ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.
నంద్యాలలోని ఒక మైనారిటీ కుటుంబంలో 11 మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపణలను ప్రస్తావిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌ను బుద్దా వెంకన్న గుర్తు చేశారు. మొత్తం 3,36,307 మంది పరీక్షలకు హాజరుకాగా 16,347 మందికి ఉద్యోగాలు లభించాయని, ఎక్కడైనా అవినీతి లేదా పక్షపాతం జరిగి ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని అన్నారు. ఈ చర్చకు నారా లోకేష్ ఎలాంటి భద్రత లేకుండా ఒంటరిగా హాజరుకావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీని 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి తీర్పు ఇచ్చారని, అదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరింత దారుణ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి దనేకుల వెంకట సుబ్బారావు, సెక్రటరీ రియాజ్, బసవేశ్వరరావు, తిలక్ రామ్‌సింగ్, శివ, ఎం. ఈశ్వర్, ఎస్. సురేష్, కప్పిరెడ్డి రాజు, షేక్ బడేషా, జి. పద్మాకర్ నాయుడు, కె. శేషారావు, ఎం. దుర్గారావు, షేక్ ఖాసిం, ఎ. దుర్గారావు, టి. శ్రీనివాస్, ఎన్. దుర్గారావు, కె. ప్రవీణ్, దనేకుల నాని, షేక్ ఇస్మాయిల్, డేవిడ్ రాజు, లకు శాంతి, కొసనా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
