AP | తూర్పు, ప‌శ్చిమ కోళ్ల‌కు కొత్త క‌ష్టం … బర్డ్ ఫ్లూతో వేలాది కోళ్లు మరణం ….

గ‌త 15 రోజులుగా అనూహ్యంగా మ‌ర‌ణాలు
ఇప్ప‌టికే 20వేల కోళ్ల‌కు పైగా మృతి
వివిధ పౌల్ట్రీల‌లో కోళ్లకు అస్వ‌స్థ‌త‌
ల్యాబ్ టెస్ట్ లో బ‌ర్డ్ ఫ్లూ గా నిర్ధార‌ణ‌
అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం..
వ్యాధి సోకిన కోళ్ల‌ను చంపిపూడ్చివేయాల‌ని అదేశం
ప్ర‌తి కోడికి రూ.90 న‌ష్ట ప‌రిహారం
రెండు వారాల పాటు చికెన్ కు దూరంగా ఉండాల‌ని సూచ‌ల‌న

రాజ‌మండి | ఏలూరుః ఆంధ్ర‌ప్ర‌భః ఆంధ్రప్రదేశ్‌లోని కోళ్ల‌కు కొత్త క‌ష్టం వ‌చ్చింది.. గ‌త 15 రోజులుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని వివిధ పౌల్ట్రీల‌లో కోళ్లు అనూహ్యంగా మ‌ర‌ణిస్తున్నాయి..ఇప్ప‌టికే 20 వేల‌కు పైగా కోళ్లు మృత్యువాత ప‌డ్డాయి.. ఇక రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని ల్యాబ్‌ టెస్ట్‌లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని భోపాల్‌లోని యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబ్‌ తేల్చింది.


పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కాకినాడ, ఏలూరు పశుసంవర్ధకశాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్తనమూనాలు తీసి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్‌5ఎన్‌1 పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయింది.

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు పూణే ల్యాబ్‌లో నిర్ధారణ అయిందని జిల్లా అధికారులు వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. దీనిపై పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఇక బర్డ్‌ ఫ్లూగా తేలిన రెండు ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి రూ.90 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్‌ వ్యాపించి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు జీవభద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయకపోవడం కూడా వ్యాధి విస్తరణకు కారణంగా చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్‌ బ్రతకలేదని… ప్రస్తుతం రాష్ట్రంలోని అధికశాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుంది.

ఇక .ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే రాజమండ్రి కలెక్టరేట్ లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 9542908025 ను సంప్రదించాలని కోరారు.అలాగే చికెన్ తినొద్దని ఏపీ సర్కార్‌ హెచ్చరికలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ అంటువ్యాధి .. ఇది మనుషులకూ వ్యాపించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు సూచించారు. ఇక వైరస్‌ సోకని కోడి మాంసాన్ని, గుడ్లును బాగా ఉడికించి తినాలన్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం. అప్పుడు ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెప్పారు. సరిగ్గా ఉడికించకుండా నిర్లక్ష్యం చేసి తింటే.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. రెండు వారాల పాటు ఈ ప్రాంతాల‌లోని ప్ర‌జ‌ను చికెన్ కు దూరంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *