చాక్లెట్ ఆశ చూపి అమానుషం
-6 ఏళ్ల బాలికపై అసభ్య ప్రవర్తన
-చాక్లెట్ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు
-తల్లి ఫిర్యాదుతో కలకలం
మంథని, ఆంధ్రప్రభ: మంథని మండలంలోని ఓ గ్రామంలో పసికూనపై అమానుషమైన సంఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు వివరాల ప్రకారం, బాధితురాలి తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 12న సాయంత్రం సుమారు 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను ఇంటి సమీపంలో నివసించే బూడిద రాకేష్ చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు చాక్లెట్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తన తల్లికి చెప్పింది. అదే రోజు సాయంత్రం స్నానం చేయిస్తుండగా బాలిక నొప్పిగా ఉందని తెలపడంతో తల్లిదండ్రులు అనుమానించారు. మరుసటి రోజు గురువారం రోజున మంథని, గోదావరిఖని ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు అనుమానాస్పద పరిస్థితి ఉన్నట్లు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బూడిద రాకేష్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
