హెచ్‌ఎండీఏ పరిధిలో టిడీఆర్ సర్టిఫికెట్లకు కొత్త నిబంధనలు..
- బిల్డింగ్ రూల్స్‌లో కీలక సవరణలు…
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ, వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీవో నంబర్ 218ను విడుదల చేసింది.
తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012లోని **రూల్ 17(సీ)**కి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో టీడీఆర్‌ల జారీ, వినియోగ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. హెచ్‌ఎండీఏ అమలు చేస్తున్న ప్రాజెక్టుల కోసం అవసరమైన లేదా అప్పగించిన భూములకు ఇకపై హెచ్‌ఎండీఏనే టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది.
హెచ్‌ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) ప్రాంతాల్లోని భూములకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం అవసరమైన లేదా అప్పగించిన భూములకు కూడా టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగం
హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టీడీఆర్‌ను వినియోగించుకోవడం లేదా బదిలీ చేసుకోవడంలో ఉన్న పరిమితులను సడలించారు.
టీడీఆర్ జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు జారీ, లెక్కల నిర్వహణ, వినియోగంలో ఏకరీతి విధానం అమల్లోకి రానుంది.
బిల్డ్ నౌ వ్యవస్థలో మార్పులు
కొత్త నిబంధనలకు అనుగుణంగా బిల్డ్ నౌ వ్యవస్థలో టీడీఆర్ ప్రాసెసింగ్, జారీ, అకౌంటింగ్, వినియోగానికి అవసరమైన మార్పులు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్ లేదా సంబంధిత వివరాల ప్రతిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు), ఎఫ్‌సీడీఏలకు సమాచారం, రికార్డు కోసం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్తగా జారీ చేసే టీడీఆర్‌లు తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012, తదుపరి సవరణలు, ఇతర చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
