సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం..

రెండో రోజు ఘనంగా వైదిక కార్యక్రమాలు
ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు


(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకుని రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న త్రయాహ్నిక వరుణ యాగం, వరుణ జపం రెండో రోజు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 14 నుంచి 16 వరకు నిర్వహిస్తున్న ఈ వైదిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శ్రీ దుర్గా స్నానఘాట్, పాత యాగశాల వేదికలుగా వివిధ పూజలు, హోమాలు నిర్వహించారు.

విశేష పూజలు, రుద్రహోమం..

శనివారం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు దుర్గా ఘాట్ వద్ద వరుణ అనువాక కార్యక్రమం, మండప పూజ నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పాత యాగశాల వద్ద రుద్రహోమం చేపట్టారు. సాయంత్రం వివిధ హోమాలు, మండప దేవతా హోమాలతో పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. లోకకల్యాణం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలనే సంకల్పంతో జరుగుతున్న ఈ వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.