కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్నిప్రమాదం

యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్

హనుమకొండ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : గీసుకొండ మండలం శాయంపేట హవేలీలోని కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రేటర్‌ వరంగల్‌ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాదం జరిగిన గణేశాయ ఎకోపెట్‌ ఫ్యాక్టరీని పార్టీ నాయకులు సందర్శించారు. ఆయిల్‌ లీకేజీ విషయాన్ని కార్మికులు ముందుగానే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం తీవ్రతరం అయిందని వారు ఆరోపించారు. మంటలు మూడు అంతస్తులకు వ్యాపించడంతో యంత్రాలు, ప్లాస్టిక్‌ సామగ్రి దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పేర్కొన్నారు.

కార్మికులతో రోజుకు 12 గంటలకు పైగా పని చేయిస్తూ ఎనిమిది గంటల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని బాలరాజు ఆరోపించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లోని అన్ని ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బండి కోటేశ్వరరావు, పూలక్క, మర్రి మహేష్‌, లవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.