టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..
కర్నూలు రూరల్ బ్యూరో (ఆంధ్రప్రభ): కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆది కృష్ణమ్మతో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు యాదవ్, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రంసింగ్ తదితరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి నినాదాలు చేస్తూ పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని కోరారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, ఆనందరావు, కొంకటి లక్ష్మినారాయణ, ధరూర్ జేమ్స్, షేక్ వహీద్ హుసేన్, అర్జా రామకృష్ణ, సోమిశెట్టి శ్రీకాంత్, అబ్బాస్, జె. తిరుపాల్ బాబు, కురువ ఎల్లప్ప, కుంపటి కృష్ణ, సత్రం రామకృష్ణుడు, పి. హనుమంతరావు చౌదరి, మాళిని, నాగార్జున, పేరపోగు రాజు, ప్రవీణ్, బాల వెంకటేశ్వరరెడ్డి, మందా అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
