సౌత్ కొరియాపై గెలిచి భారత్‌కు గోల్డ్

  • భారత రికర్వ్ బాలికల జట్టుకు బంగారు పతకం
  • వరల్డ్ ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషనల్‌–2026లో సత్తా చాటిన భారత జట్టు
  • దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన యుక్తశ్రీ
  • సీనియర్‌ విభాగంలో దేశవ్యాప్తంగా టాప్‌–8 ప్రాబబుల్స్‌లో కొనసాగుతున్న ప్రతిభావంతురాలు
  • యుక్తశ్రీ, జట్టు సభ్యులు, తల్లిదండ్రులు, కోచ్‌లకు ఏపీ ఆర్చరీ అసోసియేషన్ అభినందనలు

విజయవాడ, ఆంధ్రప్రభ: దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ కేఏఏ యూత్‌ ఇన్విటేషనల్‌–2026లో భారత రికర్వ్‌ బాలికల జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆగస్టు 10 నుంచి 14 వరకు ఇన్చియాన్‌ నగరంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోటీల్లో కొండపావులూరి యుక్తశ్రీ, కృషి కుమావత్‌, ప్రాజల్‌ తొలియాలతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో దక్షిణ కొరియా జట్టుపై 5–3 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయంతో దేశానికి స్వర్ణ పతకం అందించిన కొండపావులూరి యుక్తశ్రీతో పాటు జట్టు సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు నందమూరి తేజస్విని, చైర్మన్‌ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో యుక్తశ్రీ కీలక పాత్ర పోషించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్న యుక్తశ్రీ ప్రస్తుతం దేశ సీనియర్‌ విభాగంలో టాప్‌–8 ప్రాబబుల్స్‌లో కొనసాగుతున్నారని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యుక్తశ్రీ తల్లిదండ్రులు, కోచ్‌ల కృషిని కూడా అభినందించారు.