ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలి
నందిగామ (ఆంధ్రప్రభ) : నందిగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సైలు కె. సూర్య వంశీ, వి. మహతి పాల్గొని విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, దేశ అభివృద్ధి, సమాజ శ్రేయస్సు, చట్టాలను గౌరవించడం, బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించడం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలని, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, బాలల భద్రత, మహిళలను గౌరవించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఆన్‌లైన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.
