అభివృద్ధి.. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
చిత్తూరును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం
ప్రతి పేదింటికీ అండగా.. ప్రతి కుటుంబానికీ భరోసాగా
వైద్యం.. విద్య.. వ్యవసాయానికి పెద్దపీట
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్
చిత్తూరు, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ బ్యూరో) : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను పరిశీలించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ ఆరోగ్య సేవల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 10,34,288 మందికి సేవలు అందించామని చెప్పారు. ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయడంతో పాటు ఆరోగ్య సేవల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని వివరించారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సత్యకుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో కొత్త కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో చెరువులు, సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. సూక్ష్మ సాగునీటి పరికరాలు, వ్యవసాయ పరికరాలు, రాయితీలు అందించడంతో పాటు నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆదాయ మార్గాలు పెంచేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. జిల్లాలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సౌకర్యాల మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.

పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి ద్వారా యువత ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. చిత్తూరు జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తమ సేవలు అదించిన 424 మంది ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు ప్రశంస పత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు డి. ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ మేయర్ అముద, మాజీ ఎమ్మెల్యే గాంధీ, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డుడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, శిక్షణ కలెక్టర్ వెంకటేష్, అదనపు ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
