రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ వార్నింగ్..
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదు..
వ్యాఖ్యలపై హైకమాండ్‌తో చర్చిస్తా: మహేష్ గౌడ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, దీనిపై ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో చర్చిస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు
పార్టీ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రి అయినా, సాధారణ కార్యకర్త అయినా అందరికీ ఒకే నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.
క్రమశిక్షణారాహిత్యంపై చర్యలు తప్పవు
క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు, వాటిపై తీసుకోవాల్సిన చర్యల అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
హామీలపై అధిష్టానమే నిర్ణయం
రాజగోపాల్‌రెడ్డికి పార్టీ అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చి ఉండవచ్చని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే పదవులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ హైకమాండ్‌కే ఉంటుందని స్పష్టం చేశారు.
అందరి కోరికలు ఒకేసారి తీర్చడం సాధ్యం కాదు
పార్టీలో ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు ఉంటాయని, కానీ ఒకేరోజు అందరి కోరికలను నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ ప్రయోజనాలు, అధిష్టానం నిర్ణయాల మేరకే ముందుకు సాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎంతో సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజగోపాల్‌రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు ఉంటాయన్నారు. అధిష్ఠానం హామీ ఇచ్చిందని, ఆ స్థాయిలో వాళ్లు చూసుకుంటారని, రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ తవివరించారు.
