మహనీయుల త్యాగాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలి

  • -వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ (ఆంధ్రప్రభ): ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్య ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆచరణలోకి తీసుకొచ్చారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయ సాధన కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు తాంగిరాల రామిరెడ్డి, భీమిశెట్టి ప్రవల్లిక, కలపాల అంబేడ్కర్, వియ్యపు అమర్‌నాథ్, ముసునూరు సుబ్బారావు, సయ్యద్ అలీమ్‌తో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.