వేయి వీరుల మర్రిచెట్టు.. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్య వీరుల మరుగున పడిన చరిత్ర

రాంజీ గోండు నాయకత్వంలో సాగిన గెరిల్లా పోరాటం

నిర్మల్ మర్రిచెట్టుకు ఉరితీయబడిన వేయి మంది వీరులు

హైదరాబాద్ రెసిడెన్సీ ముట్టడిలో తుర్రేబాజ్ ఖాన్ త్యాగం

గుర్తింపుకు నోచుకోని అమరుల చరిత్ర

హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అశువులు బాసిన హైదరాబాద్ సంస్థాన వీరుల చరిత్ర కాలగమనంలో కలిసిపోయిన వైనమిది. వారి ప్రాణత్యాగాలకు చరిత్ర పుటల్లో సరైన చోటు దక్కని దుస్థితి ఇది.

మీరట్‌లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి సమాంతరంగా హైదరాబాద్ సంస్థానంలో గెరిల్లా పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసిన వీరుల చరిత్రను, వారి పేర్ల జాబితాను లండన్ విక్టోరియా లైబ్రరీలో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం అమరుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

1857లో రాంజీ గోండు నాయకత్వంలో దండకారణ్యాలను పోరాట వేదికలుగా చేసుకుని బ్రిటిష్ వలసవాదులపై పోరాడిన వీరులు ఎందరో ఉన్నారు. అదే సమయంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీ ముట్టడిలో ప్రాణాలు కోల్పోయిన తుర్రేబాజ్ ఖాన్‌తో పాటు అండమాన్ జైలులో శిక్ష అనుభవించిన పలువురు స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు.


రాంజీ గోండు నాయకత్వంలో వీరోచిత పోరాటం

ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి సమాంతరంగా రాంజీ గోండు నాయకత్వంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగింది. గోండులు, రోహిల్లాలు కలిసి నిజాం రాజ్యంలో ఉన్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు.

అడవి బిడ్డల హక్కులను అణచివేసిన బ్రిటిష్ పాలకులను గెరిల్లా పోరాటాలతో ఎదుర్కొన్నారు. ఈ పోరాటాల తీవ్రత ఎంతటిదంటే నాటి బ్రిటిష్ వైస్రాయ్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా ఆ వీరుల త్యాగాలకు తగిన గుర్తింపు లభించకపోవడం గమనార్హం.


చరిత్ర మరిచిన గోండు వీరులు

రాంజీ గోండు గోండు సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడు. ఆయన కార్యకలాపాల పరిధి ప్రస్తుత ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాలకు విస్తరించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.

ఈ తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టారు. తెలంగాణ గిరిజన చరిత్ర అధ్యయనాల ప్రకారం కల్నల్ రాబర్ట్స్ ఆధ్వర్యంలోని 47వ రెజిమెంట్ హింగోలి, బళ్లారి ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ వైపు తరలివచ్చి యుద్ధం ప్రకటించింది.

ఆంగ్లేయుల కాలం నాటి భారత ప్రభుత్వ అధికారిక జిల్లా రికార్డుల ప్రకారం 1860లో నిర్మల్ ప్రాంతంలో బ్రిటిష్, నిజాం సేనల మధ్య ఘోర యుద్ధం జరిగింది.

నాటి ఆధునిక ఆయుధాలతో వచ్చిన సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతో ఎదుర్కొన్న రాంజీ గోండు సేనలు చివరకు ఓడిపోయాయి. ఈ యుద్ధంలో రాంజీ గోండు, ఆయన ముఖ్య అనుచరులు సహా వేయి మంది పోరాట యోధులు బ్రిటిష్ సేనలకు చిక్కారు.

వారందరినీ నిర్మల్ బత్తీస్ దర్వాజ కోట సమీపంలోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ప్రపంచ చరిత్రలో ఒకే చెట్టుకు వేయి మందిని ఉరితీసిన విషాద సంఘటన హైదరాబాద్ సంస్థానంలోనే చోటుచేసుకోవడం విషాదకర చారిత్రక ఘటనగా నిలిచింది.

ఉరితీయబడిన వేయి మంది స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు ఇప్పటికీ తెలంగాణ అధికారిక రికార్డుల్లో కనిపించకపోవడం ఆవేదన కలిగించే విషయం.

ఈ రికార్డులను నాటి కల్నల్ రాబర్ట్ బ్రిటన్‌లోని వైస్రాయ్‌కు పంపించగా, ప్రస్తుతం అవి విక్టోరియా లైబ్రరీలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాలను ముద్దాడిన వేయి మంది గిరిజనుల వివరాలను స్వాతంత్ర్యం అనంతరం కూడా సేకరించకపోవడంతో వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదు.

అయితే ఇటీవల ఈ అంశాన్ని చరిత్రకారులు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా పరిశోధనలు ప్రారంభమైనట్లు సమాచారం.


హైదరాబాద్ రెసిడెన్సీ ముట్టడిలో తుర్రేబాజ్ ఖాన్

దేశంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో భాగంగా సిపాయిల తిరుగుబాటుకు మద్దతుగా 1857 జూలై 17న హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీ (ప్రస్తుత కోఠి ఉమెన్స్ కళాశాల)పై స్వాతంత్ర్య పోరాట యోధులు దాడి చేశారు.

తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో సుమారు 500 మంది యోధులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో అనేక మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు.

తుర్రేబాజ్ ఖాన్ తప్పించుకున్నప్పటికీ అనంతరం బ్రిటిష్ సేనలకు చిక్కి కాల్చి చంపబడ్డారు. స్వాతంత్ర్య పోరాటయోధుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆయన మృతదేహాన్ని కోఠిలోని దీపస్తంభానికి 11 రోజుల పాటు వేలాడదీశారు.

ఈ పోరాటంలో పాల్గొన్న మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్‌ను అరెస్టు చేసి అండమాన్ జైలుకు తరలించారు. స్వాతంత్ర్య పోరాట యోధులుగా నిలిచిన వీరులను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో గుర్తించకపోవడంతో వారి వీరోచిత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది.