విద్యార్థులకు గుడ్‌న్యూస్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇక నుంచి ప్రతి ఏటా ముందస్తుగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి నిధులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. నెక్లెస్ రోడ్, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
“ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయడానికి వీల్లేదు. విద్యార్థులు అడగకుండానే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ప్రక్షాళన చేసి, ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు సిద్ధంగా ఉంచుతున్నాం” అని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఏటా రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
సర్టిఫికెట్లతో కాదు.. నైపుణ్యాలతోనే ఉద్యోగాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. “ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు ఆ తర్వాత నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి సమాజం అవకాశాలు కల్పిస్తుందని, కేవలం సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగం వస్తుందని చెప్పలేమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీ వంటి వేదికలను ఉపయోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఆడపిల్లలు నర్సింగ్ విద్యను అభ్యసిస్తే జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో రూ.2 లక్షల వరకు వేతనాలతో ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని సీఎం చెప్పారు.
చదువుతో పాటు క్రీడలు, నైపుణ్యాల్లోనూ రాణించాలి
ప్రస్తుతం చదువుల్లో పోటీ పెరిగిందని సీఎం అన్నారు. చాలా మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. “చదువు మాత్రమే కాదు.. సాంకేతిక నైపుణ్యాల్లో రాణించే వారు ఉంటారు. కొందరు క్రీడల్లో ప్రతిభ చూపిస్తారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి” అని అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.కోటి నగదు బహుమతి అందిస్తామని సీఎం తెలిపారు.
బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్, దీప్తి దివాంజీ వంటి క్రీడాకారులను ఉదాహరణగా పేర్కొన్నారు. “మీరు క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించండి. దేశ స్థాయిలో గౌరవం తీసుకురండి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించండి. ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే బాధ్యత నాది” అని సీఎం అన్నారు.
కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు
చదువు మాత్రమే జీవితాలను మార్చే మార్గమని, నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. “ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివితే అమెరికాలో ఉద్యోగం వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సాంకేతిక విప్లవం వచ్చింది. కృత్రిమ మేధ కారణంగా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
కులాల మధ్య అంతరాలు తగ్గించేందుకు చర్యలు
కులాల మధ్య అంతరాలను తగ్గించి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా మార్పులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు. జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు కేవలం జయంతులు, వర్ధంతుల నిర్వహణ కోసం మాత్రమే కాదని అన్నారు.
వారి త్యాగాలు, సేవలు, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా ఈ విగ్రహాలు నిలుస్తాయని చెప్పారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యలో రాణించడంతో పాటు సామాజిక చైతన్యంతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
