టీవీ ఛానెళ్లకు భారీ ఊరట..

  • 12 నిమిషాల ప్రకటనల పరిమితి రద్దు
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, సమాన పోటీ కోసమే నిర్ణయం: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టెలివిజన్‌ ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. టీవీ ఛానెళ్లపై అమల్లో ఉన్న 12 నిమిషాల ప్రకటనల వ్యవధి పరిమితిని (యాడ్‌ క్యాప్‌) రద్దు చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ ప్రసార రంగంలో సమాన పోటీని ప్రోత్సహించడం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్పు తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

2006లో కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ నిబంధనలు–1994 కింద టీవీ ఛానెళ్లకు ప్రకటనల వ్యవధిపై పరిమితిని తీసుకొచ్చారు. అప్పట్లో కేబుల్‌ టీవీ ప్రధాన ప్రసార వేదికగా ఉండేది. ఛానెళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ప్రసార సామర్థ్యం పరిమితంగా ఉండేది.

అయితే ప్రస్తుతం టీవీ ప్రసార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం పేర్కొంది. డిజిటలైజేషన్‌ తర్వాత డీటీహెచ్‌, ఐపీటీవీ, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో ఛానెళ్ల సంఖ్య భారీగా పెరిగింది.

ప్రస్తుతం టీవీ పంపిణీ సంస్థలు వందల సంఖ్యలో ఛానెళ్లను అందిస్తున్నాయని, దీనివల్ల ప్రేక్షకులకు ఎక్కువ ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.

మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, డిజిటల్‌ మీడియాతో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ప్రకటనల వ్యవధికి సంబంధించిన పాత నిబంధనలను కొనసాగించడం అవసరం లేదని కేంద్రం భావించింది.

భారత్‌లో మీడియా రంగం ప్రకటనల ఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతోందని, ఛానెళ్లకు అవి చెల్లింపు లేదా ఉచిత ప్రసార సేవలు అయినా ప్రకటనలు కీలక ఆదాయ వనరుగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

అదే సమయంలో సంప్రదాయ టీవీ ఛానెళ్లకు, ప్రకటనల వ్యవధిపై పరిమితులు లేని డిజిటల్‌ మీడియా వేదికలకు మధ్య సమాన పోటీ లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

టీవీ రంగంలో, అలాగే టీవీ మరియు డిజిటల్‌ మీడియా మధ్య తగిన పోటీ ఉందని భావించిన కేంద్రం.. ప్రకటనల వ్యవధి పరిమితిని తొలగించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ నిబంధనలు–1994లో సవరణల నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి అమల్లోకి రానుంది.