జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి భారీ బడ్జెట్

గ్రంథాలయాల అభివృద్ధికి రూ.11.80 కోట్ల ఆమోదం.. 21,600 కొత్త పుస్తకాల పంపిణీ

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో చిత్తూరు జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ త్రైమాసిక బడ్జెట్ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రంథాలయాల అభివృద్ధి, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల కల్పన, పోటీ పరీక్షల అభ్యర్థులకు అవసరమైన పుస్తకాల కొనుగోలు, కొత్త భవనాల నిర్మాణం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ల చెల్లింపుల కోసం రూ.8.80 కోట్లు ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల మరమ్మతులకు రూ.25 లక్షలు, కొత్త గ్రంథాలయ భవనాల నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. చిత్తూరు జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనం వేగంగా నిర్మాణంలో ఉందని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తొట్టంబేడు గ్రంథాలయ భవనం పూర్తికాగా, వరదయ్యపాలెం గ్రంథాలయ భవనం నిర్మాణం తుది దశకు చేరుకుందని వెల్లడించారు.

గ్రేడ్-1, గ్రేడ్-2 గ్రంథాలయాలకు కంప్యూటర్ల కొనుగోలుకు రూ.20 లక్షలు, ఫర్నిచర్ తదితర సౌకర్యాలకు రూ.50 లక్షలు కేటాయించారు. సాధారణ పాఠకుల కోసం పుస్తకాల కొనుగోలుకు రూ.30 లక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ప్రత్యేక పుస్తకాల కొనుగోలుకు అదనంగా రూ.10 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు.

గ్రంథాలయ సెస్ వసూళ్లపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రంథాలయ సెస్ రూపంలో రూ.1.70 కోట్లు అందాయని, పెండింగ్‌లో ఉన్న సెస్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రంథాలయ సెస్‌ను ప్రతి నెలా గ్రంథాలయ సంస్థల ఖాతాలకు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని సమావేశం స్వాగతించింది.

జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. తిరుపతి, మదనపల్లె, పలమనేరు గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికను వివరించారు. అలాగే సీఎస్‌ఆర్ నిధులతో శ్రీకాళహస్తి, సత్యవేడు గ్రంథాలయాలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, పేద, వెనుకబడిన వర్గాల యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

సమావేశం అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేతుల మీదుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు 21,600 నూతన పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో ఈఎంఈఎస్‌కో ప్రచురణల 257 శీర్షికలకు చెందిన 16,000 పుస్తకాలు, ఆర్‌ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో 600 పుస్తకాలు, వివిధ దాతలు అందజేసిన 5,000 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యులు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, జిల్లా విద్యాశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, వయోజన విద్యాశాఖ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.