చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్

చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్

బెట్టింగ్ మామూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన పరిణామంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వరపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు మామూళ్లు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ అనంతపురం ఐజీ షిమోషి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ సమగ్ర నివేదికను ఐజీకి అందించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పోలీసు వర్గాల సమాచారం మేరకు, చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్ల నుంచి సీఐ మహేశ్వర భారీ మొత్తంలో వసూళ్లు జరిపించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌కు ముందే నగరంలోని బెట్టింగ్ నిర్వాహకులను పిలిపించి, వారి కార్యకలాపాలపై వివరాలు సేకరించి, వాటాలో భాగంగా లక్షల రూపాయలు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉండగా, జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, లాటరీ వంటి అక్రమ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ తుషార్ డూడీ పలు సందర్భాల్లో హెచ్చరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి సుమారు 16 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో ఏడుగురిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల అనంతరం సీఐ వ్యవహారశైలిపై అనుమానాలు మరింత బలపడడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.

సీఐ మహేశ్వరపై ఇదే మొదటి ఆరోపణ కాదని తెలుస్తోంది. గతంలో నగరిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుట్కా వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు రావడంతో అప్పటి ఎస్పీ మణికంఠ నివేదిక సమర్పించిన విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు ఆయనను లూప్‌లైన్‌కు బదిలీ చేసి, అనంతరం మళ్లీ వన్‌టౌన్ సీఐగా నియమించారు.

తాజా పరిణామాలతో చిత్తూరు పోలీసు శాఖలో కలకలం రేగింది. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని ఈ సస్పెన్షన్ స్పష్టంగా ఇస్తోందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపే దిశగా మరిన్ని చర్యలు కొనసాగనున్నాయి.

Leave a Reply