రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై చిన్ననాటి కోచ్ స్పందన
- ‘2027 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడాలని నా కోరిక’
- రిటైర్మెంట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన దినేశ్ లాడ్
ఆంధ్రప్రభ: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడనే వార్తలపై ఆయన చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. రోహిత్ రిటైర్మెంట్ గురించి వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా రోహిత్ భారత జట్టుకు ఆడాలని… అది తన కోరిక అని స్పష్టం చేశారు.
ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేశ్ లాడ్ మాట్లాడుతూ.. “రోహిత్ 2027 ప్రపంచకప్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. అతను రిటైర్ అయితే ఓ స్వర్ణయుగానికి ముగింపు పలికినట్లే. ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంత మాత్రాన అతను గొప్ప ఆటగాడు కాదని చెప్పలేం. సెలెక్టర్ల ఆలోచన ఏమిటో నేను చెప్పలేను. కానీ రోహిత్ మాత్రం ఇంకా ఆడాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నారు.
సెలెక్టర్ల నిర్ణయంపై ఊహాగానాలు
కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరగనున్న వన్డే.. రోహిత్ చివరి మ్యాచ్ కావచ్చని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2026లో నిరాశపరిచిన ప్రదర్శన
2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 2026లో ఇప్పటివరకు ఆడిన 8 వన్డేల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అఫ్గానిస్థాన్‌పై చేసిన ఒక అర్ధశతకం మాత్రమే ఉంది. అతని బ్యాటింగ్ సగటు, స్ట్రైక్‌రేట్ కూడా గత ప్రదర్శనతో పోలిస్తే తగ్గాయి. అయితే 2025, 2026 సీజన్లను కలిపి చూస్తే 22 వన్డేల్లో 891 పరుగులు చేసి రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు నమోదు చేశాడు.
రోహిత్ స్వర్ణయుగం
2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా అవకాశం రావడం కెరీర్‌కు కీలక మలుపు అయ్యింది. అప్పటి నుంచి భారత జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేలకుపైగా పరుగులు చేసిన రోహిత్, వన్డేల్లో 11 వేలకుపైగా పరుగులు, టీ20ల్లో 4 వేలకుపైగా పరుగులు నమోదు చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించిన ఘనత కూడా రోహిత్ ఖాతాలో ఉంది. అయితే 2027 ప్రపంచకప్ వరకు అతను కొనసాగుతాడా లేదా అన్నది ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఆసక్తికర చర్చగా మారింది.
