Hyderabad Bullet Train Hub | దేశంలోనే తొలి ఎయిర్-రైల్-రోడ్ హబ్ ఏర్పాటు

Hyderabad Bullet Train Hub | దేశంలోనే తొలి ఎయిర్-రైల్-రోడ్ హబ్ ఏర్పాటు
Hyderabad Bullet Train Hub | బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక
శంషాబాద్ సమీపంలో సమగ్ర రవాణా కేంద్రం
భారీ బస్ టెర్మినల్, మెట్రో కనెక్టివిటీ
తెలంగాణకు గేట్వేగా మారనున్న శంషాబాద్
Hyderabad Bullet Train Hub |హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు భూ సేకరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చిక్కులు లేకుండా, రైతులనుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. ఇందుకు డీపీఆర్ లు కూడా సిద్దమవుతుండగా, డ్రాఫ్ట్ డీపీఆర్‌లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని బహదూర్‌గూడలో ఇందుకోసం 650 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. హైదరాబాద్ నుంచి ముంబయి, హైదరాబాద్ – చెన్నై వయా అమరావతి, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్ల మధ్య బుల్లెట్ రైళ్ల మధ్య జరిగే రాకపోకలు, వాటికి సంబంధించిన కార్యకలాపాలను బహదూర్‌గూడ నుంచి నిర్వహించాలని రాష్ట్రం భావిస్తున్నది. దీంతోపాటుగానే ఇక్కడే మెట్రో రైల్ టెర్మినల్తోపాటు, భారీ బస్ టెర్మినల్ కూడా నిర్మించాలనే యోచన చేస్తున్నది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే బుల్లెట్ ట్రైన్ హబ్ ఉండాలని ముఖ్యమంత్రి Revanth Reddy రెండు నెలల కిందట నిర్ణయించారు. అందుకు శంషాబాద్ నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు దగ్గరలోనే బహదూర్‌గూడలో ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు సీఎంవోకు వివరించారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా రూపొందిస్తున్నారు.
కూతవేటు దూరంలోనే భూములు…
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేకు కూతవేటు దూరంలోనే బహదూర్‌గూడలో ప్రభుత్వ భూములున్నాయి. బుల్లెట్ ట్రైన్ హబ్ నిర్మించడానికి 400 నుంచి 500 ఎకరాల వరకు భూములు అవసరమవుతాయని రైల్వే శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. సర్వే నంబరు 62, 28లో మొత్తం 650 ఎకరాల భూములున్నాయి. అయితే ఒకేచోట 500 ఎకరాల భూములు ఉండడంతో రెవెన్యూ అధికారులు వీటిని ఎంపిక చేశారు.
ఇక్కడ బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటైతే రైళ్లలో ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుంది. రైల్వే లైన్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల బుల్లెట్ ట్రైన్లో వచ్చే ప్రయాణికులు ఇక్కడ దిగి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణం…
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను హైదరాబాద్ శివార్లకే పరిమితం చేస్తున్నారు. అక్కడి నుంచి ఈవీ బస్సుల్లో సిటీలోని వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణికులను చేర్చడానికి ప్రభుత్వం భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.
బుల్లెట్ ట్రైన్ హబ్‌కు సమీపంలో 150 ఎకరాల్లో బస్ టెర్మినల్ నిర్మిస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఒకేచోట ఉండేందుకు వీలుగా రోడ్లు-భవనాలు, మున్సిపల్, రెవెన్యూ, రవాణా, పరిశ్రమల శాఖలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో GMR Group ఎయిర్‌పోర్టు, Hyderabad Metropolitan Development Authority, హైస్పీడ్ రైల్ కారిడార్, మెట్రోరైలు, ఆర్టీసీ వంటి సంస్థల మధ్య సమన్వయంగా చేపట్టనున్నారు.
ముంబయి – పుణె – హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ముందుగా నిర్ణయించిన మేరకు కోకాపేట వరకే ఉండేది. అయితే ఈ ప్రాజెక్టును శంషాబాద్ వరకు విస్తరించాలని National High Speed Rail Corporation Limited కోరింది.
తెలంగాణకు గేట్వేగా…
ఇంతవరకు శంషాబాద్ అంటే కేవలం ఓ అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే ఇకపై అది తెలంగాణ రవాణా వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విమానం, హైస్పీడ్ రైలు, మెట్రో, అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ ఇలా అన్నిరకాల రవాణా సౌకర్యాలు ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది దేశంలోనే అతి పెద్ద సమగ్ర రవాణా కేంద్రంగా శంషాబాద్‌ను అభివృద్ధి పథంలో నడపనున్నారు.
నాగోల్ నుంచి మెట్రో…
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో ప్రతిపాదించిన నాలుగు కీలక మార్గాల్లో నాగోల్ – శంషాబాద్ కారిడార్ ఒకటి. ఈ మార్గం పూర్తయితే విమానం దిగిన వెంటనే నగరంలోని వివిధ ప్రాంతాలను నేరుగా చేరుకోవచ్చు. దీంతో నగరంలోని ట్రాఫిక్ జామ్‌లు, ప్రయాణ ఛార్జీలు తగ్గుతాయి. శంషాబాద్లోనే భారీ మెట్రో డిపోనూ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
దేశంలోనే తొలి ఎయిర్ – రైల్ – రోడ్ హబ్..
విమానాశ్రయానికి హైస్పీడ్ రైలు, మెట్రో, బస్ టెర్మినల్ వంటి రవాణా సౌకర్యాలు ఒకే దగ్గర ఉండటం దేశంలో మరెక్కడా లేదు. ఇది పూర్తయితే భవిష్యత్ నగర ప్రణాళికలకు జాతీయ మోడల్‌గా మారే అవకాశముంది.
హైస్పీడ్ రైల్వేకు కంట్రోల్ సెంటర్…
విమానం దిగాక హైస్పీడ్ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ ముందు భాగంలో హైస్పీడ్ రైల్వే స్టేషన్ ప్రతిపాదనలోకి వచ్చింది. భవిష్యత్తులో విమానాశ్రయం ముందు భాగంలో విస్తరణ జరుగుతుందని GMR Group పేర్కొంది. దీంతో దక్షిణ దేశంలో రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
విమానం దిగాక హైస్పీడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు సుమారు 3-4 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంది. దీనికోసం మోనో రైళ్లను వినియోగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడే ఈ రైళ్ల ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, ప్రధాన మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేస్తామని National High Speed Rail Corporation Limited తెలంగాణ ప్రభుత్వానికి వెల్లడించింది. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె వైపు ప్రతిపాదించిన మార్గాల్లో నడిచే హైస్పీడ్ రైళ్లకు ఇది కంట్రోల్ సెంటర్‌గా అవతరించనుంది.
