BRS Party | ఒంటరిగానే పోటీ చేస్తాం … 100 సీట్లు సాధించి అధికారం చేప‌డ‌తాం – హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలను బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ , మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. “కొందరు పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై కేసీఆర్ ఇప్పటికే కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. “రేవంత్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క చెరువు అయినా తవ్వారా? రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయకుండా కొంతే చేశారు” అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో అగ్రగామిగా నిలిస్తే, అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చేసిన వ్యాఖ్యలను నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. “అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా సహించబోం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కొందరు అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల నిర్వహణ సరిగా లేదని, దీనివల్ల రాష్ట్ర పరువు పోయిందని హరీశ్ రావు ఆరోపించారు. “అందాల పోటీలు నిర్వహించడం కూడా చేతకాక రాష్ట్ర ప్రతిష్ఠను మసకబార్చారు. మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, సీసీ ఫుటేజీని బయటపెట్టాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *