విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: పీఓ మంద మకరంద

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ‘గిరి విద్య’ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా, ఉద్యోగ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరంద కోరారు. గిరి విద్య ప్రోగ్రామ్‌లో భాగంగా ఆశ్రమ గురుకులాల్లో చదువుతూ ఉచిత ఐఐటీ జేఈఈ కోచింగ్, ఎంపీసీ హాస్టల్ వసతి కోసం ఎంపికైన 10 మంది గిరిజన విద్యార్థులను హైదరాబాద్‌లోని మాడ్యులస్ కళాశాలకు పంపేందుకు ఐటీడీఏ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. సోమవారం ఐటీడీఏ కార్యాలయం ముందు ఈ బస్సును పీఓ జెండా ఊపి ప్రారంభించి, విద్యార్థులను సాగనంపారు.

అంతకుముందు అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పీఓ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించడమే గిరి విద్య లక్ష్యమని, విద్యార్థులంతా రాణించి తమ కుటుంబానికి, ఐటీడీఏకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ ప్రేమకళ, ఏపీఓ (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డిప్యూటీ డీఈఓ చందన్, ఏసీఎంఓ జగన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.