వడదెబ్బతో యువకుడు మృతి..

మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట, మండలం కమలాపురంకు చెందిన ఇటికాల రఘు (28 ) అనే యువకుడు వడదెబ్బతో శనివారం రాత్రి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి మృతుడి స్నేహితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపురంలోని సుభాష్ చంద్రబోసు కాలనీకి చెందిన ఇటికాల రఘు జీవనోపాధి కోసం తన తల్లి , సోదరులతో కలిసి గత కొంత కాలంగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లో ఉంటున్నాడు.
ఇటికాల రఘు అక్కడ సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. రోజు వారి వలే శనివారం కూడా సెంట్రింగ్ పనులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. శనివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇటికాల రఘు మృతి చెందగా మృత దేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామమైన కమలాపురం తీసుకు వచ్చారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఇటికాల రఘు మృతితో సుభాష్ చంద్రబోసు కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
