నేరాల నియంత్రణకు సీసీటీవీలే కీలకం
నేరాల నియంత్రణకు సీసీటీవీలే కీలకం
ఎన్.పి.కుంటలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన 22 సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభం
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరస్తులను త్వరగా గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి వద్ద కనీసం ఒక నాణ్యమైన సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎన్.పి.కుంట పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 22 సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కలిసి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కదిరి సబ్‌డివిజన్‌లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీటీవీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఎన్.పి.కుంట మండలంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో 22 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తిమ్మమ్మ మర్రిమాను వంటి ప్రముఖ పర్యాటక కేంద్రం ఈ ప్రాంత పరిధిలో ఉండటంతో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని పేర్కొన్నారు.
కదిరి సబ్‌డివిజన్‌లో ఇప్పటికే ఎమ్మెల్యే సహకారంతో పోలీసు శాఖకు ఎనిమిది వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, అత్యవసర పరిస్థితుల్లో వాటి ద్వారా పోలీసులు వేగంగా స్పందించే అవకాశం కలిగిందన్నారు. కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలోని సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీసీటీవీ కెమెరాల అవసరం మరింత పెరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ఇంటి యజమానులు బయట ఉన్న సమయంలో గృహ భద్రతను పర్యవేక్షించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కెమెరాల ఉనికి నేరస్థుల్లో భయాన్ని కలిగించడమే కాకుండా, ఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి కేసులను ఛేదించేందుకు కీలక ఆధారాలుగా నిలుస్తాయని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, ఎన్.పి.కుంట వంటి ప్రాధాన్యత కలిగిన మండలంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా ఎస్పీ చొరవతో కదిరి పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 180 సీసీటీవీ కెమెరాలను ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు.
ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియోగించి శాంతిభద్రతలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రతినిధులను ఎస్పీ, ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు నాగేంద్ర, నారాయణరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎస్సైలు కృష్ణమూర్తి, చెన్నయ్య, సుమతి, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్‌అప్: ఎన్.పి.కుంట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
