సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం
బకాయిలు, డీఏలు, పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం : మంత్రి హామీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల కూటమి ప్రభుత్వం 2003లో నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి విముక్తి కల్పించి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ హనుమప్ప, సాకే భాస్కర్, ఎర్రిస్వామి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, పీఆర్సీ కమిషన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న టెట్ (TET) నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, జయప్రసాద్, బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు, రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
