తృటిలో తప్పిన భారీ ప్రమాదం

తృటిలో తప్పిన భారీ ప్రమాదం
– ప్రైవేట్ బస్సుకు తగిలిన విద్యుత్ వైర్లు..
– ప్రయాణికులు క్షేమం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం రాత్రి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బాలాజీ ట్రావెల్స్‌కు చెందిన సూపర్ లగ్జరీ ప్రైవేట్ బస్సు కొత్తచెరువు సమీపంలో విద్యుత్ వైర్లను తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యుత్ వైర్లలో మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో బస్సు కొత్తచెరువు ప్రాంతానికి చేరుకుంది. ఈ సమయంలో బస్సు పైభాగం రహదారి పక్కన ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా స్పార్కింగ్ ఏర్పడి మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రి వేళలో అకస్మాత్తుగా మంటలు రావడంతో ప్రయాణికులు కేకలు వేస్తూ ఆందోళనకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం మరింత పెరగకుండా తప్పించగలిగారు. వెంటనే బస్సును అక్కడి నుంచి ధర్మవరం వైపు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతంలో జాగ్రత్తలు పాటించకుండా బస్సును నడపడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు దేవుడి దయతో ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
