వృద్ధుల సంరక్షణ కుటుంబ సభ్యుల బాధ్యత..

వృద్ధుల సంరక్షణ కుటుంబ సభ్యుల బాధ్యత..

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : వృద్ధుల సంరక్షణ కుటుంబ సభ్యుల బాధ్యత అని పెద్దపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లో గల రెడ్డి వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధుల హక్కులు, సంక్షేమ చట్టాలు, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల వారి సంతానం ప్రేమానురాగాలతో ఉండాలని సూచించారు. వృద్ధుల ఆలనా పాలనా చూసుకోకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు.

వృద్ధుల సంరక్షణ, సంక్షేమానికి చట్టాలున్నాయని, ఏదేని సమస్యలుంటే వృద్దులు న్యాయ సహాయం పొందే అవకాశాలను వివరించారు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయని సంతోషపడాలా లేక వృద్ధులను, తల్లిదండ్రులను వదిలేస్తున్నారని బాధపడాలా అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలకు వెళ్లే పరిస్థితి లేని సమాజం నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమాల్లో సర్పంచ్ తాడిశెట్టి చామంతి శ్రీకాంత్, తహసీల్దార్ రాజయ్య, రూరల్ ఎస్ఐ శ్వేత, న్యాయవాది సత్యనారాయణ రెడ్డి, విశ్రాంత ఎల్ఐసి అధికారి అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.