అమ్మ ఆలయంలో భద్రత కట్టుదిట్టం.

అమ్మ ఆలయంలో భద్రత కట్టుదిట్టం.

ఇంద్రకీలాద్రిపై ‘మూడంచెల భద్రతా తనిఖీ’ విధానం.. అమలుకు
నగర పోలీస్ అధికారులు, వైదిక సిబ్బందితో ఉన్నత స్థాయి సమావేశం.
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో.
క్షేత్రస్థాయిలో భద్రతా పాయింట్ల పరిశీలన

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడంతో పాటు, ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక పటిష్టమైన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. రానున్న రోజుల్లో విశేష ఉత్సవాలు ఉన్నందున, దేవస్థాన భద్రత, భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఉదయం దేవస్థాన కార్యాలయంలో నగర పోలీస్ అధికారులు, వైదిక సిబ్బంది, ఆలయ అధికారులతో ఈవో ఒక ప్రాధాన్యత కలిగిన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

‘మూడంచెల భద్రతా తనిఖీ’ గురించి ​ఈ సమావేశంలో ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా డివోటీ ఫ్రెండ్లీ తరహాలోనే ఇంద్రకీలాద్రిపై ‘మూడంచెల భద్రతా తనిఖీ’ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని, ​ఇటీవల కాలంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ఆర్జిత సేవల్లో పాల్గొనే వారి డిమాండ్ పెరగడం వల్ల క్యూలైన్ల నిర్వహణ సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ​ఈ నేపథ్యంలో, రద్దీ సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు, ప్రతి భక్తుడిని మూడు వేర్వేరు పాయింట్ల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ​దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు ఈ తనిఖీ కేంద్రాల వద్ద తమ టికెట్లను చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో, టికెట్ లేని సామాన్య భక్తులకు సర్వదర్శనం లైన్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో స్పష్టం చేశారు.

సెల్ ఫోన్ వినియోగంపై ఆందోళన..

​ఆలయ ప్రాంగణంలో భక్తులు సెల్ ఫోన్లు వాడకం వలన పలు ఇబ్బందులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని ఈవో పేర్కొన్నారు. దీని నివారణకు గానూ ఆలయంలో ‘సెల్ ఫోన్ల నిరోధక వ్యవస్థ’ను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే సెల్ ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం లగేజ్ తోనే కొంత మంది భక్తులు ఆలయం లోకి రావడం గమనించామని, కొత్త విధానం అమలుతో భక్తులు లగేజ్ తో ఆలయం లోకి రాకుండా ప్రత్యామ్యాయ ఏర్పాటు చేస్తామని, లగేజ్ స్కానర్ ఏర్పాటు పరిశీలన ఉందని శీనా నాయక్ వెల్లడించారు.

​ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన – డ్యూటీ పాయింట్ల మార్పు..

​సమావేశం అనంతరం ఈవో వి.కె. శీనా నాయక్ పోలీస్ ఉన్నతాధికారులు జి. రామకృష్ణ, దుర్గారావు, వన్ టౌన్ సిఐ గుణ రామ్ దేవస్థానం వైదిక సిబ్బందితో కలిసి కొండపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ,నగరపోలీస్, రెవిన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ధర్మకర్తల మండలి లతో సంయుక్తముగా ముందుకు సాగుతామని ఈవో వివరించారు. ‘మూడంచెల భద్రతా వ్యవస్థ’ను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా క్యూ లైన్లు, ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న భద్రతా డ్యూటీ పాయింట్లను పరిశీలించి, అవసరమైన చోట్ల మార్పులు చేర్పులు చేయాలని దేవస్థానం సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించారు. ప్రోటోకాల్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటమే ఈ నూతన భద్రతా విధానం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈవో వివరించారు.ప్రోటోకాల్ విధానంలో మార్పు విషయం లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటానికి ప్రయత్నం చేస్తున్నామని ఈవో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *