BRS Yatras | కేసీఆర్ బస్సు, కేటీఆర్ పాదయాత్రలు?
BRS Yatras | కేసీఆర్ బస్సు, కేటీఆర్ పాదయాత్రలు?
BRS Yatras | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో మళ్లీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టే అంశంపై చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడం లక్ష్యంగా ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భవిష్యత్తులో పాదయాత్ర చేస్తానని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లడం, కేటీఆర్ పాదయాత్ర ద్వారా యువత, పార్టీ క్యాడర్‌తో నేరుగా మమేకం కావడం అనే ప్రణాళికపై చర్చ జరుగుతోంది.
తాజాగా బీఆర్ఎస్ 25 ఏళ్ల రోడ్‌మ్యాప్‌తో తెలంగాణ భవిష్యత్తుపై దృష్టి పెట్టిందని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూనే, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ బలంగా నిలుస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాత్రల ద్వారా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలన్న ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రలపై ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్ ప్రకటించలేదు. తేదీలు, మార్గాలు, కార్యక్రమాల వివరాలు పార్టీ నాయకత్వం ఖరారు చేసిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
