చౌటుప్పల్‌లో వైభవంగా బ్రహ్మంగారి కల్యాణోత్సవం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ప్రథమ కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

​ఘనంగా ఎదురుకోళ్లు.. కమనీయం కల్యాణం
​ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో స్వామి, అమ్మవార్లు పెళ్లి పీటలపై మెరిసిపోయారు. భక్తుల ‘గోవింద’ నామస్మరణతో విశ్వకర్మ కాలనీ మారుమోగింది.

​విశిష్ట అతిథిగా మధుసూదనాచారి..
​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాలతో సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని స్వామివారు ప్రబోధించారని కొనియాడారు.

చౌటుప్పల్ మండల విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు అంతా ఏకమై ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించి, కల్యాణాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave a Reply