యూజర్‌నేమ్ ఫీచర్‌పై వాట్సాప్ క్లారిటీ !
వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్స్ పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో మెటా కీలక వివరణ ఇచ్చింది. ఫేక్ ఎకౌంట్స్, వ్యక్తిత్వ దోపిడీ (ఇంపర్సనేషన్), ఆన్లైన్ మోసాలకు అవకాశం ఉందా అనే అంశంపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తుండటంతో యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది.
మెటా విడుదల చేసిన వివరాల ప్రకారం, యూజర్‌నేమ్ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ అని తెలిపింది. వినియోగదారులు కోరుకుంటే మాత్రమే యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. లేకపోతే ఇప్పటిలాగే తమ మొబైల్ నంబర్‌తోనే వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ల మాదిరిగా వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ల కోసం పబ్లిక్ సెర్చ్ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. దీంతో ఎవరైనా మీ యూజర్‌నేమ్‌ను వెతికి సంప్రదించే అవకాశం ఉండదని పేర్కొంది.
భద్రతను మరింత పెంచేందుకు ‘యూజర్‌నేమ్ కీ’ అనే అదనపు సేఫ్టీ ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు మెటా తెలిపింది. ఈ ఫీచర్‌ను వినియోగదారులు ప్రారంభిస్తే, కొత్త వ్యక్తి సందేశం పంపాలంటే యూజర్‌నేమ్‌తో పాటు ప్రత్యేకంగా ఇచ్చే కీ కూడా తెలియాల్సి ఉంటుంది. దీంతో అనుమతి లేకుండా సందేశాలు పంపడం మరింత కష్టమవుతుందని కంపెనీ వివరించింది.
అదేవిధంగా ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన యూజర్‌నేమ్‌లను ముందుగానే రిజర్వ్ చేసినట్లు తెలిపింది. దీని వల్ల వారి పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. ఎవరైనా పోలి ఉన్న యూజర్‌నేమ్‌లతో మోసాలకు పాల్పడితే, ఫిర్యాదులు, బ్లాక్‌లను నిరంతరం పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అంతేకాకుండా తొలిసారి సందేశం పంపే వ్యక్తి ఏ దేశానికి చెందినవారు, కొత్త ఖాతానా కాదా వంటి వివరాలను కూడా వినియోగదారులకు చూపించేలా కొత్త భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా వెల్లడించింది. దీంతో వాట్సాప్‌లో మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదాన్ని మరింత తగ్గించవచ్చని కంపెనీ తెలిపింది.
