సర్ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు దిశానిర్దేశం
కేసముద్రం, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడు తన ఓటు హక్కును కాపాడుకునేలా అప్రమత్తంగా ఉండాలని కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నేపథ్యంలో గురువారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి శ్రీనివాస్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, టీపీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో ప్రజలకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలి, వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎలా నమోదు చేయాలి, అవసరమైన పత్రాలను ఎలా సమర్పించాలి అనే అంశాలపై బీఎల్‌ఏలకు సవివరంగా అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమని పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
