రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల అందజేత..
వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే పూర్తి చేయడమే లక్ష్యం
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
రీ సర్వే ప్రక్రియ పూర్తైన గ్రామాల్లో ప్రతి నెల 9వ తేదీన స్వయంగా పాల్గొని రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,867 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసి 29 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 9,929 గ్రామాల్లో కూడా రీ సర్వే పూర్తి చేసి 64.43 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
