తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామా ఎన్టీఆర్..

తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామా ఎన్టీఆర్..
పటమట, ఆంధ్రప్రభ ఢిల్లీ పెద్దల చేతిలో తెలుగువారికి జరుగుతున్న అవమానాన్ని భరించలేక ఎదురుతిరిగి, దేశ రాజకీయాల్లో తెలుగు ప్రజల సత్తాను చాటిన మహానేత ఎన్టీఆర్ అని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
గురువారం గణేష్ నగర్ కె.ఎస్ గ్రాండ్‌లో క్లస్టర్–3 మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ పాల్గొని ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త అర్థం చెప్పిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ నటుడిగా కోట్లాది ప్రజల అభిమానాన్ని గెలుచుకుని, రాజకీయాల్లో ప్రజల జీవితాలను మార్చిన మహానుభావుడిగా ఆయన నిలిచారని తెలిపారు.
పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన మహానేత అని గుర్తుచేశారు. మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం ఆయన చారిత్రాత్మక నిర్ణయాల్లో ఒకటని అన్నారు.
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారని పేర్కొన్నారు. “సమాజమే దేవాలయం – పేదలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఆయన ప్రజల కోసం పనిచేశారని తెలిపారు.
అధికారాన్ని కాకుండా ప్రజల ప్రేమను సంపాదించిన అరుదైన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనకు టీడీపీ కట్టుబడి పనిచేస్తోందని గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో 3, 4 డివిజన్ల టీడీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
