పరకాల మెయిన్‌రోడ్డు గుంతలమయం

పరకాల మెయిన్‌రోడ్డు గుంతలమయం

  • గుంతల రోడ్డులలో నిత్యం ప్రమాదాలు
  • చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రధాన రహదారులపై ఏర్పడిన లోతైన గుంతలు వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్కం శంకర్ ఆరోపించారు. పాత ఏటీఎం సెంటర్, బస్టాండ్ సర్కిల్ సెంటర్, హుజూరాబాద్ రోడ్డులోని పోచమ్మ గుడి సమీపంలో మెయిన్‌రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .ముఖ్యంగా మూలమలుపులు ఉన్న ప్రాంతాల్లో రోడ్డుపై లోతైన గుంతలు ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందన్నారు. పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో చెరువులు, కుంటలు, గుట్టలపై దృష్టి సారిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారుల సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే గుంతలను పూడ్చి రహదారులను మరమ్మతు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.