Ponnam Prabhakar | పవన్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్
Ponnam Prabhakar | పవన్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్
తెలంగాణ మా అయ్యా జాగీరు..
Ponnam Prabhakar | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణను ఎవరో వచ్చి అడగాల్సిన నేల కాదని, ఇది తమ తండ్రిదాతల జాగీరు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో పవన్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్‌కు ఏపీలోనే రాజకీయంగా దిక్కులేదని ఆయనే స్వయంగా అంగీకరించినట్లుగా కనిపిస్తోందని పొన్నం ఎద్దేవా చేశారు. తెలంగాణకు పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయనకు ఉన్న అక్కసు మరోసారి బయటపడిందని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాలు పరిపాలనపరంగా విడిపోయినా, ప్రజలు కలిసి ఉండాలని తాము ఎప్పుడూ కోరుకున్నామని పొన్నం అన్నారు. అయితే ప్రాంతాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు.
బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌కు సరైన స్క్రిప్ట్ ఇచ్చినట్లు లేరని పొన్నం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పవన్‌ను బీజేపీ లేదా బీఆర్‌ఎస్ ఎవరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారో త్వరలోనే ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.
తెలంగాణ గౌరవం, రాష్ట్ర స్వాభిమానం విషయంలో తాము రాజీ పడబోమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణపై వ్యాఖ్యలు చేసే ముందు ఈ నేల చరిత్ర, పోరాటం, త్యాగాలను గుర్తుంచుకోవాలని పవన్‌కు సూచించారు.
