భక్తి పారవశ్యంలో బెజవాడ.. జగన్నాథ రథయాత్రకు జనసంద్రం
- వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
- వేలాది మంది భక్తులు, విదేశీ భక్తులతో..
- కళాకారుల బృందాలతో ఆధ్యాత్మిక శోభాయాత్ర
- హరినామ సంకీర్తనలు, పూల వర్షం, రంగవల్లులతో పులకరించిన పురవీధులు
- ఆరు కిలోమీటర్ల కొనసాగిన రథోత్సవం
- పూరీ రథయాత్రను తలపించిన వేడుకలు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: జగన్నాథుడి దివ్యనామస్మరణతో విజయవాడ నగరం గురువారం ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయింది. ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర వేలాది మంది భక్తుల జయజయధ్వానాలు, హరినామ సంకీర్తనలు, వేదఘోషలు, భజనల నడుమ అత్యంత వైభవంగా సాగింది. భవానీపురం నుంచి సీతమ్మవారి పాదాల సమీపంలోని గుండిచా మందిరం వరకు సాగిన ఈ మహారథోత్సవం పూరీ జగన్నాథ రథయాత్రను తలపిస్తూ నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చింది.
మంగళ హారతుల నడుమ..
భవానీపురంలోని సీతార గ్రౌండ్స్‌లో ప్రత్యేక పూజలు, మహామంగళహారతి అనంతరం మధ్యాహ్నం రథయాత్ర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించిన మహారథం స్వాతి థియేటర్ రోడ్డు, కనకదుర్గ ఆలయ రహదారి, రథం సెంటర్ మీదుగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించి గుండిచా మందిరానికి చేరుకుంది. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు అడుగడుగునా పాల్గొని భక్తి ప్రవాహాన్ని సృష్టించారు. రథయాత్ర మార్గమంతా భక్తులు రంగవల్లులు, ముగ్గులు వేసి స్వామివారికి ఘన స్వాగతం పలికారు. రథం ముందుగా నగర ప్రముఖులు సంప్రదాయ ‘చేరా పహరా’ సేవలో భాగంగా బంగారు చీపురుతో మార్గాన్ని ఊడుస్తూ వినయానికి ప్రతీకగా సేవలందించారు. రథంపై పూల వర్షం కురిపిస్తూ, హారతులు సమర్పిస్తూ, “హరే కృష్ణ… హరే రామ” నామసంకీర్తనలతో నగర వీధులను మార్మోగించారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు..
దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి విచ్చేసిన భక్తులు, ఇస్కాన్ సేవకులు, కళాకారుల బృందాలు, విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు, భజనలు, కీర్తనలతో రథయాత్రకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. చిన్నారులు జగన్నాథ స్వామిపై ప్రదర్శించిన భక్తి నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రథం నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ప్రయాణించిన ప్రతి చోట ప్రజలు తమ ఇళ్ల, దుకాణాల ముందు దీపహారతులు సమర్పించి జగన్నాథ స్వామి ఆశీస్సులు పొందారు. యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు వేలాది మంది భక్తులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేయడంతో పాటు భక్తుల కోసం స్వచ్ఛంద సేవకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణం, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో రథయాత్ర ప్రశాంతంగా సాగింది.
ఈ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు శ్రీమన్ చక్రధారి దాస్ మాట్లాడుతూ.. జగన్నాథ రథయాత్ర విజయవంతానికి సహకరించిన జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, స్వచ్ఛంద సేవకులు, దాతలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్నాథుని రథాన్ని దర్శించడం, రథాన్ని లాగడం, నామసంకీర్తనలో పాల్గొనడం మహాపుణ్యప్రదమని పేర్కొంటూ, ఈ మహోత్సవం విజయవాడలో ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

