ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీఎస్ ఉద్యోగుల నిరసనలు 29వ రోజుకు

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యోగుల ఆందోళన

పాల్వంచ, ఆంధ్రప్రభ : తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని ఏహెచ్‌పీ (యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్), సీఎచ్‌పీ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) విభాగాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేటీపీఎస్‌లో ఉద్యోగుల నిరసనలు 29వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిసన్లు పాల్గొని ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను తీవ్రంగా ఖండించారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల సామర్థ్యం, భద్రత, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నాయకులు పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్‌పీఈజేఏసీ చైర్మన్ రాజేందర్, కన్వీనర్ ఎస్.కె. యస్మీన్, జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు, బ్రహ్మజీ, మడకం శ్రీనివాసరావు, రాజేష్, తిరుపతి, అఖిల్, మధుబాబు, మహేష్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, వెంపటి వెంకటేశ్వర్లు, నరసింహారావు, సయ్యద్, సంపత్, చంద్ర కళాధర్, భాగ్యరాజు, పావని, లక్ష్మి, వాహిని తదితరులు పాల్గొన్నారు.