Balka Suman | ప్రశ్నిస్తే అక్రమ కేసులు..

Balka Suman | ప్రశ్నిస్తే అక్రమ కేసులు..

Balka Suman | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి తెలంగాణ భవన్ వద్ద నెలకొన్న ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. సింగరేణికి సంబంధించిన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.

బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకోగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తరలించారు. సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అరెస్ట్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తనపై వందలాది కేసులు నమోదు చేశారని, జైలు జీవితం అనుభవించానని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, అక్రమాల అంశాలపై తాను ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకుంటున్నారని సుమన్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని, చట్టపరంగా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Leave a Reply