Australia Open 2026 | భారత మహిళల జోరు..

Australia Open 2026 | భారత మహిళల జోరు..

  • సింధు, తన్వి సహా ఐదుగురు ప్రీక్వార్టర్స్‌కు

ఆంధ్ర‌ప్ర‌భ : సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australia Open 2026) సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో భారత మహిళా షట్లర్లు అదరగొట్టారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీ.వి. సింధు సునాయాస విజయంతో ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్ 16)కు చేరుకోగా, యువ సంచలనం తన్వి శర్మ ఐదో సీడ్‌ను ఓడించి టోర్నీలో సంచలనం సృష్టించింది.

సింధుతో పాటు తన్వి శర్మ, మాల్వికా బన్సోడ్, ఇషారాణి బరువా, తాన్య హేమంత్ కూడా రెండో రౌండ్‌కు అర్హత సాధించి భారత మహిళల ఆధిపత్యాన్ని చాటిచెప్పారు. అయితే పురుషుల విభాగంలో కిరణ్ జార్జ్, తరుణ్ మన్నేపల్లి, సనీత్ దయానంద్ తొలి రౌండ్‌లోనే ఎలిమినేట్ అవ్వ‌డం నిరాశ కలిగించింది.

సింధుకు సునాయాస విజయం..

ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన పీ.వి. సింధు తొలి రౌండ్‌లో పెరూ షట్లర్ ఇనెస్ లూసియా కాస్టిల్లో సలాజార్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 32 నిమిషాల్లోనే 21-13, 21-11 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది. మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. ఇక‌ తదుపరి రౌండ్‌లో భారత షట్లర్ ఇషారాణి బరువాతో సింధు తలపడనుంది.

చైనా ప్రత్యర్థిని మట్టికరిపించిన ఇషారాణి

ఇషారాణి బరువా తొలి రౌండ్‌లో చైనాకు చెందిన హాన్ కియాన్ జీపై గంటకు పైగా సాగిన హోరాహోరీ పోరులో 22-20, 10-21, 21-14తో విజయం సాధించింది. దీంతో రౌండ్ ఆఫ్ 16లో సింధుతో భారతీయుల మధ్య పోరు ఖాయమైంది.

Australia Open 2026

రోజులో అతిపెద్ద అప్‌సెట్‌ను 17 ఏళ్ల తన్వి శర్మ నమోదు చేసింది. ప్రపంచ 11వ ర్యాంక్, ఐదో సీడ్ చియూ పిన్-చియాన్ (చైనీస్ తైపీ)ను 21-12, 22-20తో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ 36వ ర్యాంక్‌లో ఉన్న తన్వి అద్భుత ఆత్మవిశ్వాసంతో ఆడి కేవలం 45 నిమిషాల్లోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారత షట్లర్ మాల్వికా బన్సోడ్ తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని థాయ్‌లాండ్‌కు చెందిన టోన్రుగ్ సాహెంగ్పై 15-21, 21-7, 21-13తో గెలిచింది. ఇప్పుడు రౌండ్ ఆఫ్ 16లో మాల్వికా, తన్వి శర్మతో తలపడనుంది.

తాన్య హేమంత్ అమెరికాకు చెందిన ఇషికా జైస్వాల్పై 21-17, 21-18తో విజయం సాధించింది. తదుపరి రౌండ్‌లో ఆమె ప్రపంచ 8వ ర్యాంక్, రెండో సీడ్ పోర్న్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్)ను ఎదుర్కొననుంది.

పురుషుల విభాగంలో నిరాశ…

పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కిరణ్ జార్జ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోతో జరిగిన మ్యాచ్‌లో 19-21, 21-14, 15-21తో ఓటమి పాలయ్యాడు. క్వాలిఫయర్స్ నుంచి మెయిన్ డ్రాకు చేరిన సనీత్ దయానంద్, చైనాకు చెందిన హు జే ఆన్ చేతిలో 8-21, 10-21తో పరాజయం పాలయ్యాడు.

మరో భారత షట్లర్ తరుణ్ మన్నేపల్లి రెండో సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్ లిన్ చున్-యి (చైనీస్ తైపీ)కి గట్టి పోటీ ఇచ్చాడు. మూడు గేమ్‌ల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో 21-18, 13-21, 23-25తో ఓటమి చెందాడు. మ్యాచ్ పాయింట్లు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో శుభవార్త

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ రావత్ – మనీషా కె జోడీ ఆస్ట్రేలియాకు చెందిన లిమ్ జేడెన్ – విక్టోరియా జొనాడి జంటపై 21-13, 21-14తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. అయితే మోహిత్ జగ్లాన్ – లక్షిత జగ్లాన్ జోడీ రెండో సీడ్ చైనా జంట గువో జిన్ వా – చెన్ ఫాంగ్ హుయ్ చేతిలో 6-21, 5-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Asian Games 2026 | షూటింగ్ ట్రయల్స్‌లో భారత షూటర్ల హవా…